రమాదేవి మార్క్ కవిత.
జీవితంలో మనకంటూ..ఏదీలేదని తెలిసినా…ఆశ చావదు కదా! ఏదైనా దొరుకుతుందేమోనని వెదుక్కుంటాం. ఏమీ లేనప్పుడు,మనసు శూన్యమైనప్పుడు,మనసు ముళ్ళ కంచెలా బాధపెడుతున్నప్పుడు,మన గుబులు ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది.
ఎవరో ఎందుకు..?
మనసైన వాడు,జతగాడున్నప్పుడు,అతగాడితోనే పంచుకోవాలనిపిస్తుంది..సరిగ్గా ఆమెకూ అదే అనిపించింది..ఈ రోజు కాఫీ టైమ్ కవిత సారాంశం..ఇది..మీరూ ఓ సారి ఈ కవితను చదవండి.!!
ఈవేళ
మనసెందుకో ముళ్లకంచెలా
బాధ పెడుతుంది ...
మనసు గుబులేదో
పంచుకుందామనుకుంటాను
ఓహ్... ఏం చేయను
నీ పనితనపు ముచ్చట
నాకు మాటల కరువునిచ్చింది
అప్పుడనుకుంటా
నలుగురులో ఉన్నపుడు పొట్లాడాలని
కత్తిని మరింత పదునుగా నూరాలని
రాక్షస విద్యలు కచ్చితంగా నేర్చుకోవాలని
ఓయ్
రాజకుమారా ...
ఇంతకీ
నీవు...పదిలమే కదా
*ఏదీలేదని…
ఏమీ లేదని, ఏదీ లేదని ,అంతా శూన్యమని ఆమెకు బాగా తెలుసు..అయినా ఏదో ఆశ..తన కోసం అతగాడు మాటేమైనా దాచాడేమోనన్న పీకులాట.
కానీ,
అతగాడు ఏ మాటా దాచలేదని ఆమెకు తెలుసు. అయినా....ఒశ చావదు కదా! కోరిక కునుక పట్ట నివ్వదుకదా! అలా అతగాడు తనకు చెప్పడానికి. మాటేదైనా దాచివుంచితే ఎంత బావుణ్ణు! ఆ ఆశతోనే ఆమె పదేపదే వెతుక్కుంటోంది.తన కోసం మాటేమైనా చెప్పాడేమోనని…..
ఈ ఆలోచనతోనే ఆవేళ ఆమె మనసు ముళ్లకంచెలా బాధ పెడుతుంది. మనసు గుబులేదో అతగాడితోనే పంచుకుందామనుకుంటోంది..
అయితే…సమయాన్ని చేజిక్కించుకోడానికి అతగాడు పరుగులు పెడుతుంటాడు.. ఊరకే అలిసిపోతుంటాడు..అతగాడి పరిస్థితి చూశాక ఆమెకు అక్షరమైనా చెప్పాలనిపించదు.పాపం!ఏంచేస్తుంది? అతగాడి పనితనపు ముచ్చట ఆమె మాటలకరువునిచ్చింది…
అయినా…
తన మీద సర్వహక్కులూ అతగాడివేకదా! ఎప్పుడైనా..కనీసం పొలమారైనా ,’ఓయ్...పిల్లా’ అనే చిన్ని మాటైనాపలకకుండా ఉంటాడా? అన్న చిన్న ఆశ ఆమెది.అప్పుడు అనుకుంటుంది..నలుగురులో ఉన్నపుడు అతగాడితో పోట్లాడాలని,కత్తిని మరింత పదునుగా నూరాలని, రాక్షస విద్యలు ఖచ్చితంగా నేర్చుకోవాలని అనిపిస్తుందట..
అతగాడిని ఆకాశమంత ప్రేమిస్తున్నానంటూనే... ఆమె విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పేచీ కోరులా
అవుతోందంటే..కారణం అతగాడిపై వల్లమాలిన ప్రేమేనని వేరే చెప్పలా?
అతగాడెక్కడున్నా...”నీ సుఖమే నే కోరుకుంటా”అన్న మాటే ఆమెది.
“ఓయ్….రాజకుమారా ! ఇంతకీ నీవు పదిలమే కదా!”అంటూ అతగాడి క్షేమాన్ని కోరుకుంటుంది.
మనసైనవాడు,తన వాడు క్షేమంగా వుంటేనే కదా! ప్రేమ పదిలంగా వుండేది.అయినా! ఈ ప్రేమే అంత. అన్నీ కుదిరితే ఐలవికాని ఆనందం..ఏదైనా కొరవడితే ముళ్ళపాన్పులా బాధిస్తుంది..వేధిస్తుంది.గుండెకోత కోస్తుంది…
ప్రస్తుతం “ఆమె” పరిస్థితీ ఇదే….!